సాంప్రదాయికములైన కళలు, ఆచారములు
మనదేశంలో చాలామంది నిరక్షరాస్యులు. అయినా వారి జీవితాలను గమనిస్తే సాధాణంగా వారు ధార్మిక జీవితమే గడుపుతూ ఉన్నట్లు విశదం అవుతుంది. పాటకజనం మాట్లాడుకునే టప్పడు మనం వింటూ ఉంటాం. వారిలో స్త్రీలు కూడా 'అన్యాయం చేయకు, కళ్ళుపోతాయి' అని అంటూ ఉంటారు. ఇది వారి ధర్మాభిజ్ఞతకు ఒక చిహ్నం.
దీని వలన 'ధర్మాచరణ మనలో ఒక సంప్రదాయమనీ, నిరక్షరాస్యులైన వారి హృదయాలలోకూడా ధర్మాభిరతి, దైవపరాయణత గాఢంగా హత్తుకొని పోయేటట్లు సంస్కార ప్రదములైన విధానాలను మన పెద్దలు ఏర్పరచారని' తెలుస్తూ ఉంది.
పాటకజనంలో కూడా జీవితధ్యేయం, న్యాయప్రవృత్తి ఇంత స్ఫుటంగా కలుగచేసిన ఆ విధానా లేవి?
పురాణములలోనుండి ఒక్కొక్క పుణ్యశ్లోకుని జీవితమును ఇతివృత్తంగా గ్రహించే 'తోలుబొమ్మల ఆటలు పల్లెలలోనూ, జనపదములలోనూ ఆడేవారు' ఉదాహరణకు హరిశ్చంద్రుని కథ హరిశ్చంద్రుడు ఎన్ని ఘాత ప్రఘాతాలు కలిగినా ఆడిన మాట తప్పడు. సత్యవ్రతం వీడడు. 'నీతిశ్లాఘ్యపథంబు తప్పరుకదా నిత్యంబు ధీరోత్తముల్' అన్న భర్తృహరి సూక్తికి ఆయన జీవితమే మేలుబంతి. ఈ విధమైన కథలను, భారత రామాయణ కథలను ఆలయాలలో వినిపిస్తూ ఉండేవారు. స్త్రీలు, వృద్ధులు, బాలురు అందరూ కథా రూపంగా విశదమయ్యే ఆచరణీయములైన విషయాలను సులభంగా గ్రహించేవారు.
ప్రస్తుతం దేశంలో నైతికవిలువలు దిగజారి పోతున్నవని వాపోతున్నాం. కల్ల, కపటం, కుతంత్రం, విద్వేషం, మోసం, లంచగొండితనం, ఆహారపదార్థములలో కల్తీ ఇవి అనుదినమూ చూచే విషయాలే. ఇవి దేశానికే కళంకము నాపాదించే దౌర్భాగ్య గుణాలు. వీనికి కారణం ప్రాచీన విధానాల క్షీణత. నీతికి పరమార్ధానికి ప్రచారము లేక పోవుట- అని నేను అనుకొంటాను.
ప్రాచీనకాలం నుండి అనూచానంగా వస్తున్న ఈ కళలను, ఆచారాలను, మనము పోగొట్టు కొనరాదనీ, వానిలో అభ్యుత్థాన బీజములున్నాయి కనుక వాని పునరుద్ధారణ ఎంతైనా అవసరమనీ ఈ మధ్య కంచిలో ఒక 'ఆగమశిల్ప సదస్సు' ఏర్పాటు చేశాం. మన పూర్వులు నిర్మలమైన జీవితములు గడిపినారంటే ఈ ప్రాచీనకళ##లే కారణం. వీని పునురుద్ధరణ సామాజికాభ్యుదయానికి దోహదకారి అనుటలో ఏవిధమైన సందేహమూ లేదు. నేటికీ ఈ కళలన్నీ పూర్తిగా సమసిపోలేదు. అక్కడక్కడ అవి సజీవంగానే ఉన్నాయి. నిరాదరణ కారణంగా ఆయా కళాకారులు ఆ వృత్తులు వదలుకొని తమ కళలకు ఏవిధమైన సంబంధమూ లేని జీవనోపాయాలు అవలంబించి తమకేకాక సమాజానికీ నిరుపయోగంగా ఉన్నారు. ఏ కళ అయినా ప్రజాదరణపై ఆధారపడి ఉంటుంది. నిరాలంబములై ఇప్పటికే క్షీణంచిపోయిన ఈ కళలు పూర్ణ విస్మృతికి లోనయ్యే ప్రమాదం ఉన్నది.
దక్షిణాదిలో 'విల్లుపత్తు' అనే బొమ్మలాట లుండేవి. ఆంధ్రదేశములో 'బుఱ్ఱకథలు', కన్నడదేశంలో 'యక్షగానాలు' , ఒరిస్సాలో 'బాలకథ', బెంగాల్‌లో 'కథాకత' మహాష్ట్రంలో 'పోవాడా' - అని వివిధములైన పేర్లతో ఈ కథాకాలక్షేపాలు ప్రశస్తి చెందాయి. ఇవి సంస్కృతికి నీతికి అంకితములైనవి. వీని పునరుద్ధరణ ఎంతైనా అవసరం. దేశంలో అవినీతి ప్రబలి నప్పటికి ప్రజల హృదయాలలో గౌరవప్రదమైన ధార్మిక జీవనం గడపాలనే ఇచ్ఛమాత్రం నిర్ణిద్రంగానే ఉంటూ ఉన్నది. భక్తి, సత్యసంధత, గౌరవం వీనికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆసక్తి అందరికీ కద్దు. అనృతం, మోసం, దగా, దొంగతనం మంచివి కాదన్న జ్ఞాపకమూ ప్రజలకు ఉన్నది. కాని జీవన విధానాలే తారుమారైన ఈ సాంఘికవాతావరణంలో సూటియైన ధర్మపథంలో వారు పోలేకున్నారు. ఈ ప్రాచీన కళాసముద్ధరణ నైతిక వాతావరణం కల్పించి ధార్మికనిరతిని జనులకు బోధించటంలో ఎంతో సహాయపడగలదు.
6-7)
ఇక ఆలయాల విషయం ఎత్తుకొంటే అర్చకులు, శిల్పులు అనాథలవలె ఉన్నారు. తమ బాగోగులు చూచే పుణ్యాత్ములు ఎవరూ లేరన్న అభిప్రాయం వారిలో గాఢంగా ఉన్నట్లు కానబడుతుంది. ఒక పవిత్రమైన సంప్రదాయానికి వారసులైన వీరికి తగిన ప్రోత్సాహం ఇచ్చి కృతజ్ఞతాభావం ప్రకటించుట మనధర్మం. ఆ ప్రోత్సహం ఈయని నాడు ఒక ఉజ్జ్వలమైన సంప్రదాయం అవతరించుటకే కాక నానాటికి అధోగతికి పోతూఉన్న నీతిని నిలువబెట్టగల ఒక వ్యవస్థ నష్టమైపోయేమాట నిక్కము.
చాలాకాలం నుండి పుణ్యక్షేత్రాలలో వాడుకలో ఉన్నాయి రధోత్సవాలు. కొన్ని అడుగులైనాసరే ప్రతి ఒక్కరూ దేవుని రథం లాగటంలో జాతిమతభేదాలు లేకుండా ధనికుడు, దరిద్రుడు అనే వ్యవస్థ లేకుండా ఆబాలగోపాలము అంతస్తులు, ఆంతర్యాలు మరచి అత్యుత్సాహంతో పాల్గొనే వారు. దేవుని సన్నిధిలో అందరూ సమానులే అన్న నీతికి ఇది ప్రత్యక్ష ప్రమాణం. రథం లాగుతూ ఎవరిని తాకినా అంటు మైల లేదని, రథం లాగిన పిదప స్నానం చేయరాదని శాస్త్రాలు చెపుతున్నాయి. ఇప్పుడు రథం లాగుటకు ఎవరూ ముందుకు రావటం లేదు. కనుక ఆలయాల 'ట్రస్టీలు' యాంత్రికోపాయాలకై యోచిస్తున్నారు. ఇది శోచనీయం. ప్రతిఒక్కరూ వారి వారి ఊళ్ళలో రథోత్సవ సందర్భంలో సమూహంలో కలిసికొని జగన్నాథుని రథం నడచేలా చూడాలి. చిన్నరథమైనా సరే పెద్దదైనా సరే రథం లాగుటలో అందరూ పాల్గొని ఈ పురాతనాచారాన్ని సముద్ధరించాలి. ఈ ఆచారం లేనిచోట క్రొత్తగా ప్రవేశ##పెట్టాలి. సంఘీభావమునకు ఈ ఆచార మొక గుర్తు.
ఒక్కొక్క వీథి కొనలోనూ పందిళ్లు వేసి ఉత్సవాల సందర్భంలో వీధినాటకాలు ఆడే సాంప్రదాయమూ మన దేశంలో ఉండేది. అన్ని హంగులతోను కూడిన నాటకాలు రంగస్థలంలో ఆడేవారు. ఇది సినీమాలకాలం. నేను సినీమాకు వ్యతిరేకినికాను. కాని ఈనాటికి చలనచిత్ర ఉత్పత్తి పథకాలు, వాని ఇతివృత్తాలు చూస్తూఉంటే ఎన్నో శంకలకు ఆస్పదంగా మాత్రం ఉన్నాయి. ప్రఖ్యాతనాటక రచయిత భవభూతి భగవదుత్సవ సందర్భములలో ప్రదర్శనకు అనుకూలంగా ఉండాలని నాటకరచన చేస్తున్నానని ఒక చోట వ్రాశారు. మరియొక రచయిత తాను యజ్ఞ శాలలో ప్రదర్శించుటకై నాటకాలు వ్రాస్తున్నానని ఒకచోట చెప్పుకొన్నాడు. నాటక రంగమును నియమబద్ధంగాను, శ్రేయోమార్గంలోను నడుప గలిగితే జాతీయమైన ధర్మమును, సంస్కృతిని, వ్యాప్తం చేయటంలో ఎంతో సహాయపడుతుంది. అప్పుడు రంగస్థలి, నాటకము అనే సంస్థలు సామాజిక ప్రయోజనానికి సాధనాంగాలౌతాయి. ఈరెండింటిలోను ఒక శుభపరివర్తన కలిగినప్పుడు చలనచిత్రాలలో కూడ పరివర్తన కలుగుటకు అవకాశం ఉన్నది.
ఈ ప్రాచీనకళలు మన నిరాదరణచేత పరిపూర్ణంగా విస్మృతం కాక పునరుద్ధరింపబడి ప్రవర్ధమానం కావాలని, నైతిక పారమార్థిక ప్రయోజనకారులై విలసిల్లాలని జగన్మాతను కామాక్షీ దేవిని ప్రార్తిస్తున్నాను.
|